ఎమ్మెన్సీల్లో ఉద్యోగాలు వద్దనుకున్నారు.. కారు సర్వీసింగ్ ప్రారంభించారు..!

వేగంగా విస్తరిస్తున్న బిట్స్ గ్రాడ్యుయేట్ల "సర్వ్ఎక్స్" స్టార్టప్

ఎమ్మెన్సీల్లో ఉద్యోగాలు వద్దనుకున్నారు.. కారు సర్వీసింగ్ ప్రారంభించారు..!

Friday April 29, 2016,

4 min Read


కారు ఉంటే రయ్య్ మని దూసుకుపోవచ్చు.. కానీ దానికి సరైన ఆలనా పాలనా లేదంటే.. అదే మనకి పెద్ద గుదిబండగా మారుతుంది. ఉరుకుల పరుగుల జీవితంలో సొంత శరీరంపైనే శ్రద్ధ తగ్గిపోతోంది. ఇక కార్లపైనా దృష్టి పెట్టడం ఎలా..? ఈ సమస్యను పరిష్కరించేందుకు సిద్ధపడ్డారు ఇద్దరు మిత్రులు. బిట్స్ మెస్రా క్యాంపస్ లో కాలేజీ చదువులు పూర్తి చేసిన వీరు... ఒరాకిల్, బజాజ్ ఆటో లాంటి సంస్థల్లో వచ్చిన క్యాంపస్ ఉద్యోగాలను వదిలి పెట్టి కార్ సర్వీస్ స్టార్టప్ ను పెట్టారు. అదే సర్వ్ఎక్స్.

ఎనీటైమ్..ఎనీ వేర్ సర్వ్ ఎక్స్

ఢిల్లీ రాజధాని ఏరియాలో కారుకి ఎక్కడ రిపేరు వచ్చినా క్షణాల్లో అందుబాటులో ఉండటానికి సర్వ్ఎక్స్ టెక్నీషియన్లు రెడీగా ఉంటారు. అంతే కాదు.. సమయం చెప్పి ఇంటికి వచ్చి సర్వీసింగ్ చేయమన్నా సిద్ధమే. హఠాత్తుగా రోడ్డుమీద కారు ఆగిపోతే... మీరు పెద్దగా ఇబ్బంది పడకుండా రెక్కలు కట్టుకుని వాలిపోవడానికి చుట్టుపక్కల సర్వ్ఎక్స్ టెక్నిషియన్లు సిద్ధంగా ఉంటారు. కారుకు సీరియస్ ప్రాబ్లమ్ అయి గ్యారేజ్ కి తీసుకెళ్లాల్సి వచ్చినా... ఆ బాధ్యత వీళ్లు తీసుకుంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే కారు సర్వీస్ కి సంబంధించిన ప్రతీది వీరి ట్రేడ్ మార్క్ సేవలా అందిస్తారు.

అయితే ఈ స్టార్టప్ ఇంతగా సేవలు విస్తరించడానికి.. ఇదేదో ఏళ్ల తరబడి నడుస్తున్న సంస్థ కాదు. గత ఏడాది నవంబర్ లోనే పురుడుపోసుకుంది. దీని వ్యవస్థాపకులు ఆకాష్ సిన్హా, అనుభవ్ దీప్. వీరిద్దరూ బీహార్ లోని మెస్రాలో ఉన్న బిట్స్ ఇనిస్టిట్యూట్ లో ఇంజినీరింగ్ పూర్తి చేశారు. క్యాంపస్ ఇంటర్ఫ్యూల్లో ఒకరికి ఒరాకిల్, మరొకరికి బజాజ్ ఆటోలో ఉద్యోగాలొచ్చాయి. తోటి విద్యార్థులు, అధ్యాపకులు అభినందించారు. కానీ వీరి ఆలోచనలు వేరు.. అందుకే ఉద్యోగం చేయాలనే లక్ష్యంతో క్యాంపస్ ఇంటర్వ్యూల్లో పాల్గొనలేదని స్పష్టం చేశారు. ఇంజినీరింగ్ పట్టాతో బయటకు వచ్చేశారు. ఆ తర్వాత ఏం చేయాలన్నదానిపై రాత్రింబవళ్లు సుదీర్ఘంగా చర్చించుకున్నారు. ఢిల్లీ, గుర్గావ్ ల్లో కొత్త కొత్త ఐడియాల కోసం ప్రయత్నించారు.

టీ కొట్లో పుట్టిన ఆలోచన

గత అక్టోబర్ లో గుర్గావ్ లోని సైబర్ సిటీలో అర్థరాత్రి రోడ్డుపక్కన దుకాణంలో టీ తాగుతున్నప్పుడు వీరి చర్చ అనుకోకుండా కారు సర్వీస్ రంగం మీదకి వెళ్లింది. చివరికి వీరు తెలుసుకుందేమిటంటే... కారు సర్వీస్ రంగం ఇంకా వ్యవస్తీకృతం కాలేదు కాబట్టి.. ఇందులో అడుగుపెడితే మనదైన ముద్ర వేయవచ్చని భావించారు. అంతే వారు మరో ఆలోచన చేయకుండా పని ప్రారంభించారు. ఇరవై నాలుగేళ్ల ఈ ఇద్దరు మిత్రులు రెండు వారాల్లోనే పూర్తి సమాచారం సేకరించుకుని "సర్వ్ ఎక్స్" కు పునాది వేసుకున్నారు.

ముందుగా మార్కెట్ వ్యాలిడేషన్ చేసుకోవడానికి ఐఐటీ ఢిల్లీ క్యాంపస్ లో జరిగిన కల్చరల్ ఫెస్ట్ ను వేదికగా చేసుకున్నారు. ఆ ఫెస్ట్ కన్నా కొద్దిగా ముందుగా బేటా వెర్షన్ రిలీజ్ చేసి.. రంగంలోకి దిగారు. ఓ పది, పదిహేను కార్లను సర్వీస్ చేసే అవకాశం వస్తే మంచి స్పందన అనుకున్నారు. కానీ రెండు ఏకంగా మూడు వందల కార్లను వాటర్ సర్వీస్ చేసే ఆర్డర్లు వచ్చాయి. దీంతో వారు తమ ప్రయత్నంలో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదని గ్రహించారు. దాంతో పూర్తిస్థాయిలో సన్నద్దమయ్యి నవంబర్లో సర్వీఎక్స్ కార్యకలాపాలను పూర్తిస్థాయిలో ప్రారంభించారు. ఢిల్లీ రాజధాని ప్రాంత పరిధిలో మల్టీబ్రాండ్, మల్టీ వెహికల్ సర్వీస్ ఫ్లాట్ ఫాంగా రూపొందించారు. ఎమర్జెన్సీ పికప్స్, డోర్ స్టెప్ రిపేర్స్, రెగ్యులర్ మెయింటెనెన్స్, సర్వీసింగ్, ఇన్సూరెన్స్, బాడీషాప్ మోడిఫికేషన్స్ సహా మొత్తం సర్వీసులను అందుబాటులోకి తెచ్చారు. ప్రస్తుత బిజీ లైఫ్ లో కారుకు కోసం సమయం వృధా కాకుండా చేయడమే తమ లక్ష్యమని సర్వ్ఎక్స్ ఫౌండర్లు చెబుతున్నారు. ఢిల్లీ చుట్టుపక్కల ఉన్న వంద బ్రాండెడ్ సర్వీస్ సెంటర్లతో వీరు టై అప్ అయ్యారు.

" కార్ సర్వీస్ విషయంలో కస్టమర్ ఖర్చులను తగ్గించడంతో పాటు.. వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసి పెడతాం. ఒక్కసారి వివరాలు ఇచ్చిన తర్వాత మా రిప్రజెంటేటివ్ మొత్తం కారు బాధ్యతలను తీసుకుంటాడు" అభినవ్ 

గ్యారేజ్ కి తీసుకెళ్లి సర్వీస్ చేయాల్సిన సందర్భం కార్లకు ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి టైంలో కారు తీసుకెళ్లి సర్వీస్ చేసి.. మళ్లీ తీసుకొచ్చి అప్పగిస్తారు సర్వ్ ఎక్స్ సిబ్బంది. ఆథరైజ్డ్ సర్వీస్ డీలర్స్ వద్ద చేయించుకుంటే అయ్యే మొత్తం కన్నా సర్వ్ ఎక్స్ ఇరవై శాతం తక్కువగానే ఫీజు తీసుకుంటుంది.

image


టాప్ గేర్ లో ఎదుగుదల

మూడు నెలల కాలంలో సర్వ్ఎక్స్ ఐదు వేల కార్లను సర్వీస్ చేసింది. ఇందులో రెండు వేల కార్లకు రిపేర్ కూడా చేసింది. సర్వ్ఎక్స్ బిజినెస్ లో పెద్ద ముందడుగు ఆరెంజ్ క్యాబ్స్ తో ఒప్పందం. ఈ సంస్థ క్యాబ్ ల సర్వీసంతా సర్వ్ ఎక్స్ నే చూస్తోంది. బీటూబీ డీల్స్ తో మరింత ముందడుగు వేయాలని ఆకాష్, అనుభవ్ ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం మరింత మెరుగైన టెక్నాలజీని రూపొదించుకుంటున్నారు. వినియోగదారు కారుకి సంబంధించిన ప్రతీ అంశాన్ని విడమర్చిచెప్పేలా టెక్నాలజీ కోసం ప్రయత్నిస్తున్నారు.

" రోజుకు ఇప్పుడు మేం యాభై సర్వీస్ రిక్వెస్ట్ లను అందుకుంటున్నాం. వారానికి 30శాతం పెరుగుదల నమోదవుతోంది. ఒక్క వాటర్ సర్వీస్ కి మూడు వందలు మాత్రమే వసూలు చేస్తున్నాం. ఇది ఆథరైజ్డ్ డీలర్స్ వసూలు చేసేదాంట్లో నాలుగోవంతు మాత్రమే." ఆకాష్ 

సవాళ్లే అవకాశాలు

అయితే సర్వ్ ఎక్స్ కు అంతా పాజిటివ్ గా సాగిపోవడం లేదు. వెండార్స్ తో టైఅప్ కావడం కొంచెం కష్టమైన వ్యవహారంగా మారింది. సాధారంగా దేశ ఆటోమోబైల్ పరిశ్రమలో ఉన్న పరిస్థితుల నుంచి ఒక్కసారిగా బయటకు రావడానికి వెండర్స్ పెద్దగా ఆసక్తి చూపిండం లేదు. కానీ కొద్దికొద్దిగా వారిలో మార్పు వస్తుందని ఆకాష్ చెబుతున్నారు. సర్వ్ ఎక్స్ తో చేతులు కలిపేందుకు సిద్ధపడుతున్నారు. అయితే సర్వ్ ఎక్స్ ఇప్పుడు పూర్తిగా అథరైజ్డ్ బ్రాండెడ్ సర్వీస్ సెంటర్లతోనే అవగాహన వచ్చేందుకు ఎక్కువగా ప్రయత్నిస్తోంది. నాన్ బ్రాండెడ్ సర్వీస్ వెండర్స్ ను డోర్ స్టెప్ సర్వీస్ కు పంపించడం లేదు. ఎందుకంటే మామూలు సర్వీస్ సెంటర్ల సిబ్బంది.. కొత్తగా వస్తున్న వాహనాలపై అంత అప్ డేటెడ్ గా ఉండలేరు. దాంతో వారు కస్టమర్లకు సరైన సర్వీస్ అందించలేరు. ఫలితంగా సర్వ్ ఎక్స్ కు చెడ్డపేరు వచ్చే అవకాశం ఉంది. దీన్ని నివారించడానికి ప్రధానంగా కార్ల తయారీదారులు శిక్షణ ఇచ్చే బ్రాండెడ్ సర్వీస్ వెండార్స్ తోనే ముందుకెళ్తున్నారు. మరికొంత సాంకేతిక అందిపుచ్చున్న తర్వాత గ్యారేజ్ కు తీసుకెళ్లే అవసరం లేకుండా ఇంటి దగ్గరే పూర్తిస్థాయి సర్వీస్ చేసిచ్చేందుకు ప్రయత్నాలు చేయనున్నారు. ఒకటి రెండు నెలల్లో ఈ సౌకర్యం అంబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

సర్వ్ఎక్స్ టీం <br>

సర్వ్ఎక్స్ టీం


పోటీ కూడా అధికమే..!

కారు సర్వీస్ స్టార్టప్ లు ఇప్పుడు మార్కెట్ లో డజన్ కు పైగానే ఉన్నాయి. కార్టిసియన్, బంపర్, మెరికార్, ఆటోయార్ లాంటి స్టార్టప్ లు ఈ రంగంలో తమదైన ముద్రవేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. మార్కెట్ వర్గాల అంచనా ప్రకారం పాసింజర్ కార్ సర్వీస్ మార్కెట్ నలభై వేల కోట్ల రూపాయలు. అయితే ఈ కార్ సర్వీస్ అనేది యజమానులకు పెద్ద తలనొప్పి వ్యవహారంగా మారింది. చాలా సమయం తీసుకుంటోంది. రెండు గంటల నుంచి ఒక్కోసారి ఒక రోజు పాటు కార్ సర్వీస్ కు సమయం కేటాయించాల్సి వస్తోంది. ఈ స్టార్టప్ లన్నీ ప్రధానంగా కారు ఓనర్ కు ఎలాంటి సమయం వృధా కాకుండా.. తక్కువ ఖర్చుతో సర్వీస్ పూర్తి చేయడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నాయి. అయితే ఇదేమీ అనుకున్నంత ఈజీ కాదు. కార్ దేఖో పోర్టల్.. ఈ కార్ సర్వీస్ పోర్ట్ ఫోలియో ప్రారంభించి వల్ల కాక వెంటనే ఆపేసింది.                                 

క్లిష్టమైన మార్కెట్ పరిస్థితులను సరిగ్గా అంచనా వేసే టాలెంట్ ఉన్న ఆకాష్ , అనుభవ్ మాత్రం తమదైన ముద్ర వేసేందుకు ప్రయత్నిస్తున్నారు. మూడు నాలుగు నెలల కాలంలోనే ఢిల్లీ లో తమ సత్తా చాటారు. తర్వాత ఫండింగ్ ఇతర అంశాలను బట్టి ఇతర నగరాలకూ విస్తరించే ప్రణాళికలు వేసుకుంటున్నారు.

వెబ్ సైట్