ఏనాడూ విడిపోని ముడి వేసెనె

One of those nights!

మంచం ఒకటే అయినా నీ-నా పక్కలంటూ సరిహద్దులు పుట్టుకొచ్చే రాత్రి. ఇరువైపులా సైన్యాన్ని మోహరించి, కాల్పులకు సిద్ధంగా ఉండే రాత్రి కాదు. కయ్యానికి కాళ్ళుదువ్వననీ, సరిహద్దులను గౌరవిస్తాననీ కుదురుకున్న సంధిని ఉల్లంఘించలేని రాత్రి. తాను సత్య అయినా అతడు సముద్రాలు దాటి, యుద్ధాలు ముగించి వచ్చేవరకూ సీతలా వేచిచూడాల్సిన రాత్రి.

అతడు మంచానికి అటు చివర పడుకునున్నాడు, నల్లరగ్గు ముసుగులో. ఇంకా నిద్రపోయినట్టు లేడు. ఎలా పోతాడు? నిద్ర పట్టేంత సుఖమే అతనికుంటే, ఆ నల్లరగ్గెందుకు ఉంటుంది? ఆమె చడీచప్పుడూ లేకుండా మంచానికి ఇటు చివర పడుకుంది. అంత అలసటలోనూ ఇది ఇక నిద్రరాని రాత్రని తెలుస్తూనే ఉంది.

ఆఫీసునుండి వచ్చాక మాడిపోయున్న అతడి మొహం చూసి, ‘ఏమయ్యిందని?’ నిలదీసి, ‘ఏం లేద’న్న సమాధానాన్ని నమ్మలేక, నమ్మినట్టు నటించలేక, అంతకు మించిన సమాధానం అతనినుంచి రప్పించలేక, అర్థరాత్రి దాటేవరకూ పని నెపంతో లాప్‍టాప్ ముందు కూర్చొని కీబోర్డు మీద అసహనాన్ని అంతా చూపించి, మనసూ శరీరమూ అలసిపోయి అప్పుడే గదిలోకి వచ్చిందామె.

దుప్పటి గుండెలదాకా కప్పుకొని చీకటి గది నాలుగువైపులకూ చూసింది – అటుకీ ఇటుకీ పైకీ పక్కకీ. అతడు మూగబోయినప్పుడల్లా, చిత్రంగా ఈ గది కూడా మూగబోతుంది. బహుశా, అతడితో దానికి అలాంటి సంధి కుదిరిందేమో. పెళ్ళై కొత్తగా ఆ ఇంట్లో అడుగుపెట్టినప్పుడు —

“నీకో విషయం చెప్పనా? నువ్వు నవ్వినప్పుడల్లా ఈ గదికూడా నవ్వినట్టనిపిస్తుంది.” అంది. ఆమె చెవిలో పూర్తవ్వబోతున్న అతడి మునపటి నవ్వులోంచి మళ్ళీ కొత్త నవ్వు మొదలయ్యింది.

“రహస్యం కనిపెట్టేశావన్నమాట.” చెవిలో గుసగుసలాడాడు. అంతలోనే దూరంగా జరిగి, రెండు చేతులూ చాచి – “Welcome to the sorcerer’s world, My Lady! Anything and everything, you wish for!” అని వినయాన్ని నటిస్తూ ఓ మోకాలి మీద కూర్చొని, చేయి అందిపుచ్చుకొని ముద్దుపెట్టుకున్నాడు.

అవును. అతడు మాయగాడు. మాటల మాంత్రికుడు. వశీకరణం తెల్సినవాడు.

ఇప్పుడు మాత్రం పక్కనే అతడు ఉన్నాలేనట్టే! ఉండి కూడా లేకుండా ఎలా పోతారు, మనుషులు?

క్రాస్‌వర్డ్స్‌లో కూర్చొని గంటలు గంటలు పుస్తకాలని బ్రౌజ్ చేయటం మొదలెట్టిన సాయంత్రాల్లో, అప్పటికి ఇద్దరికీ తెలియని మిలన్ కుందేరాను కనుక్కున్నారు. కలిసి చదవటమనే ప్రయోగం మొదలెట్టిన మొదటి పుస్తకంలో, వంతులవారిగా పైకి చదువుతున్నప్పుడు, “కంటిముందున్న మనిషి మీద బెంగెలా పుట్టుకొస్తుంది?” అని ఉన్న వాక్యాన్ని అతడు…

ఆ వాక్యమేమిటో వెంటనే గుర్తురాక, దిండు పక్కనే పెట్టుకున్న తన ఫోన్‍ తీసుకొని, గూగుల్ చేసింది.

“How could she feel nostalgia when he was right in front of her? How can you suffer from the absence of a person who is present?”

How can you? How can you? — చదవటంలో అతడు తీసుకొచ్చిన నాటకీయతను నిజమనుకొని, ఏదైనా గొప్ప సమాధానం ఇచ్చి ఇంప్రెస్ చేద్దామనుకొంది. కానీ ఏం తోచలేదు ఆ క్షణాల్లో. తనని ఇంప్రెస్ చేయడానికి అతడిమీదా అంతే ప్రెజర్ ఉందని ఇంకా గ్రహించని రోజులవి.

ఇంకా అదే వెబ్ పేజ్‍లో తచ్చాడుతుంటే కనిపించిన మరో వాక్యం: “You can suffer nostalgia in the presence of the beloved if you glimpse a future where the beloved is no more.”

అప్పుడు కాదు. ఇప్పుడు అడిగితే బాగుణ్ణు, అతడు, How can you? అని. తను సమాధానంతో సిద్ధంగా ఉంది:

You can suffer nostalgia in the presence of the beloved when you know he isn’t yours. Worse, when you know he isn’t his. Though in his arms, you still pine for him, when you know he alone is being engulfed by a monster, unknown to you. I suffer with you. I suffer from you. Can you listen? Damn you!

అతడు కప్పుకున్న రగ్గులోంచి కొన్ని నల్లటి ఊలు దారాలు గొంగళి పురుగుల్లా పాక్కుంటూ ఆమెవైపుకి రావడం అప్పటికే మొదలయింది. ఆమె శరీరం పైకి మెల్లిమెల్లిగా ఎక్కుతున్నాయి కొన్ని. కొన్ని ఆమె బట్టల మీదనుంచి, మరికొన్ని బట్టల మడతల్లోంచి లోపలికి. వాటిని పక్కకు తోసేయాలనో, లేచి పక్కకు వెళ్ళిపోవాలనో ఆమె ప్రయత్నించలేదు. ఆ రగ్గులో ఆమెకు ఎటూ చోటు లేదు, కనీసం ఇలా అయినా సరిపుచ్చుకుందామనుకుంది మొదట్లో. అదే అలవాటైపోయింది. అదేం విచిత్రమైన అలవాటో, అలవాటైనా కానట్టే ఉంటుంది. అప్పజెప్పగలిగిన పాఠమే అయినా, పరీక్షల సమయంలో మర్చిపోయినట్టు.

గొంగళి పురుగుల్లా ఆమెపై పాకుతున్న నల్లని దారాలలో కొన్ని ఆమెపై అల్లుకుంటున్నాయి. కొన్ని ఒకదానితో ఒకటి పెనవేసుకొనిపోయి తాళ్ళలాగా మారి ఆమె కాళ్ళనీ, చేతులనీ కట్టేస్తున్నాయి. కుదిరితే సముద్రంలోనో, కుదరకపోతే కనీసం స్విమ్మింగ్ పూల్‍లోనో దిగాలని ఆమెకు బలంగా అనిపించింది. అతడు తోడుంటే ఇంకా బాగుంటుందని అనిపించింది.

ఆమె పాదాలకు ఇసుకంటుకుంది. గాలికి జుట్టు ఎగిరిపోతోంది. ఆమె సముద్రం ఎదురుగా, అతడితో… పరిచయం ప్రణయమవుతున్న రోజుల్లో, ఒకరి ఒడిలో మరొకరు ఒదిగిపోవటం మామూలైన క్షణాల్లో.

“సముద్రమంటే నీకెందుకంత ఇష్టం?”

“ఇష్టమని ఎవరు చెప్పారు?” ఆ పూట సముద్రం కూడా అలానే ఉంది, చిరాగ్గా, పరాగ్గా.

“మరెందుకు ఇక్కడికే వచ్చి, దాన్నే అలా చూస్తుండిపోతావ్?”

అతడు బదులివ్వలేదు. అతడు పెట్టుకున్న కళ్ళద్దాలను తీసేసి, ఆ కళ్ళల్లోకి చూసింది. కళ్ళు చిట్లిస్తూ ఆమె చేతుల్లోంచి అద్దాలను అందుకోబోయాడు. ఆమె నిలువరించింది.

“నన్నేం చూస్తావు? సముద్రాన్ని చూడు.” కళ్ళద్దాలను వెనక్కి తీసుకున్నాడు.

“అదే చూస్తున్నాను.” అంది, కళ్ళల్లో సముద్రాన్ని చూస్తూ.

“సముద్రం ఎందుకంత అల్లకల్లోలంగా ఉందంటావ్?”

భుజాలు ఎగరేశాడు. ఆమె రెట్టింపు ఆసక్తితో చూసింది ఏం చెప్పబోతున్నాడో అని. అతడు చేసిన అలవాటే. తనకు సమాధానాలు తెలీని ప్రశ్నలకు కట్టుకథలు చెప్పేవాడు. అసలు జవాబులకన్నా అప్పుడవే ఆమెకు మరింతగా నచ్చేవి.

“ఏ దేవుడో ఇచ్చిన శాపమైయుంటుంది.”

ఆ పూట కథల ఖార్ఖానా కట్టేసుందని అర్థమయ్యింది. నీటిలోకి దిగిన పిల్లలు కేరింతలు కొడుతూ ఆడుకుంటున్నారు. ఓ వైపు అలలు వేగంగా వస్తున్నాయి. పడుతున్నారు. నవ్వుతున్నారు. లేస్తున్నారు. మళ్ళీ పడ్డానికి సిద్ధపడుతున్నారు.

“నాకు దాన్ని దూరంనుండి చూస్తుంటేనే భయంవేస్తుంది. మీరంతా ఎలా ఈదుతారో, ఏంటో?” అతడేం మాట్లాడలేదు.

“ఒక మాట చెప్పు… నేనంటే భయంవేస్తే ఏం చేస్తావ్?” అడిగాడు కాసేపటికి. ఆమె సమాధానంగా, ఆ ఊహ కలిగించిన భయంతో అతడిని గట్టిగా కౌగిలించుకుంది.

“నన్ను వదిలిపోవుగా?” పోనని తలాడిస్తూ అతడినింకా గట్టిగా పట్టుకుంది. అతడి వీపును నిమిరింది.

శరీరం మీద పాకుతున్న గొంగళి దారాలు నెమ్మదించాయి. చుట్టుకున్న తాళ్ళు కొంచెం పట్టు సడలించాయి. ఒక్కసారి అవకాశమిస్తే, ఇప్పుడు కూడా అలా హత్తుకోగలిగితే, ఈ రాత్రి గడవడం పెద్ద విషయం కాదని ఆమె నమ్మకం. కానీ అతడు అందుకు ఒప్పుకోడు. తనలోని నలుపు ఆమెను నల్లగా మార్చటం అతడు భరించలేడు.

హత్తుకొని ఎంతో సేపు అలానే బీచ్‍లో ఉండిపోయేసరికి, ఆలస్యమవుతుందని బయటచేయాల్సిన డిన్నర్‍ను మానుకొని, ఆమె ఉంటున్న పి.జి. దగ్గర దిగబెట్టాడు. అతడి బైక్ శబ్ధం కనిపెట్టేసిన రూమ్మేట్, ఆమెను ఆట పట్టిస్తూ భోజనానికి పిలిచింది. చేతులు కడుక్కొని వస్తానని చెప్పి బాత్రూమ్‍లోకి వెళ్ళింది. లిక్విడ్ సోప్ చేతుల్లోకి పోసుకొని, ఏదో ఆలోచిస్తూ, చేతులు రుద్దటం మొదలెట్టింది. అలవాటు లేనిదేదో తగులుతున్నట్టు అనిపించి చేతులకేసి చూసుకుంది.

చీప్ క్వాలిటీ రగ్గులను ఎక్కువసేపు పట్టుకుంటే చేతులకి అంటుకునే పొడిపొడి ఊలులా, ఆమె చేతులకు ఏదో నల్లగా అంటుకొనుంది. ఎంతసేపు కడిగినా వదల్లేదు. ఆ పూటకు భోజనం స్పూన్‍తోనే కానిచ్చింది. గోరింటాకు ఆరకముందే నిద్రపోవాల్సి వచ్చినప్పుడు చేతులను ఓ మూలకి జాగ్రత్తగా పెట్టుకొని పడుకున్నట్టు పడుకుంది ఆ రాత్రికి.